*తుఫాన్ వేళ మానవత్వం చాటుకున్న ‘మా ఛారిటబుల్ ట్రస్ట్’*
*కోటప్పకొండ పునరావాస కేంద్రంలో 200 మందికి ఆహార ప్యాకేట్స్ పంపిణీ*
నరసరావుపేట నవంబర్ 04.రాజధాని వాయిస్:
తీవ్ర తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో నిరాశ్రయులైన నిరుపేదలకు ‘మా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆపన్నహస్తం అందించింది. ప్రకృతి విపత్తుల వేళ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ట్రస్ట్ సభ్యులు క్షేత్రస్థాయిలోకి దిగి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నరసరావుపేట మండలం కోటప్పకొండ ప్రాంతంలోని గుడిసెల వాసులను అధికారులు స్థానిక సచివాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ తలదాచుకుంటున్న బాధితులకు ఆహార కొరత ఏర్పడిందని తెలుసుకున్న ట్రస్ట్ బృందం తక్షణమే స్పందించింది. రాత్రి వేళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నా, రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనా ఏమాత్రం లెక్కచేయకుండా నరసరావుపేట నుంచి కోటప్పకొండకు చేరుకున్నారు. పునరావాస కేంద్రంలోని సుమారు 200 మందికి పైగా నిర్వాసితులతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పేదలకు స్వయంగా ఆహార పొట్లాలు, తాగునీరు పంపిణీ చేసి ఆకలి తీర్చారు. ప్రాణభయంతో పునరావాస కేంద్రానికి వచ్చి ఆకలితో అలమటిస్తున్న సమయంలో అండగా నిలిచిన ట్రస్ట్ సభ్యులకు బాధితులు కన్నీటిపర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో పెద్ద పెద్ద నాయకులు సైతం ఇళ్లకే పరిమితమైన వేళ, యువతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయక చర్యలు చేపట్టడం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి చేయూతనందించడమే తమ ప్రధాన లక్ష్యమని, మున్ముందు కూడా ఇలాంటి విపత్తు సమయాల్లో సహాయక చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ‘మా ఛారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకులు డాక్టర్ స్వర్ణ నాగరాజు, డైరెక్టర్ బెల్లంకొండ అనిల్, సభ్యులు అడపాల శేషు, రాజేష్, జీలని తదితర ట్రస్ట్ బృందం పాల్గొంది. ట్రస్ట్ ప్రతినిధులు ప్రదర్శించిన సేవాభావం, మానవతా దృక్పథాన్ని స్థానిక ప్రజలు, అధికారులు ఘనంగా కొనియాడారు.
Be the first to share your thoughts on this story!