Wednesday, 26 August 2026
Telugu Daily
Header
BREAKING

- కోటిరెడ్డి అరెస్టు, రిమాండ్ వ్యవహారాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట ఆగష్టు 26 (రాజధాని వాయిస్):చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డిపై నమోదైన కేసు, ఆయన అరెస్టు, రిమాండ్ వ్యవహారాలను మాజీ మంత్రి విడదల రజిని పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కోటిరెడ్డి సతీమణి సింగారెడ్డి లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్, మేనల్లుడు మేకల శ్రీనివాసరెడ్డితో కలిసి విడదల రజిని జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కోటిరెడ్డిపై నమోదైన కేసు వివరాలు, అరెస్టు చేసిన తీరు, రిమాండ్‌కు పంపిన పరిస్థితులను ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా కోటిరెడ్డి కుటుంబ సభ్యులు తమకు ఎదురైన పరిణామాలను జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కోటిరెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ పూర్తి అండగా ఉంటుందని, న్యాయపరమైన పోరాటంలో అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.

నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన 75 ఏళ్ల సింగారెడ్డి కోటిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఇదే కేసులో ఆయన సతీమణి సింగారెడ్డి లక్ష్మి (70)ని కూడా పోలీసులు అరెస్టు చేసినప్పటికీ, ఆమెను రిమాండ్‌కు పంపలేదు.

75 ఏళ్ల వృద్ధుడిని జైలుకు పంపడం, 70 ఏళ్ల మహిళను సైతం కేసులో అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు నిదర్శనమని విడదల రజిని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోటిరెడ్డిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వరుస కేసులతో వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

వృద్ధ దంపతులపై కేసులు నమోదు చేయడం కనీస మానవతా దృక్పథానికి విరుద్ధమని, రాజకీయ ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విడదల రజిని జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

కోటిరెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి భరోసా ఇచ్చారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!