మాచర్ల, నవంబర్ 18, రాజధాని వాయిస్ :
ఆహారం మింగడంలో ఇబ్బంది, రాత్రిపూట దగ్గు, నీరు పైకి రావడం వంటి సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని యశోద ఆసుపత్రి, మలక్‌పేట్, హైదరాబాద్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. కిషన్ నున్సావత్ సూచించారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న పెన్షనర్స్ అసోసియేషన్ భవనం లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అకలేషియా కార్డియా అంటే ఏమిటి?
మన నోటి నుంచి ఆహారం కడుపులోకి వెళ్లే మార్గాన్ని ఈసోఫేగస్ (ఫుడ్ పైప్) అంటారని డాక్టర్ వివరించారు. దాని చివర కడుపు దగ్గర లోయర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ (LES) అనే కండరపు వాల్వ్ ఉంటుందన్నారు.
అకలేషియా ఉన్నప్పుడు ఆ కండరం సరిగ్గా రిలాక్స్ అవ్వదని, దానితో పాటు ఫుడ్ పైప్ లో ఆహారాన్ని కిందికి నెట్టే కదలికలు (పెరిస్టాల్సిస్) కూడా తగ్గిపోతాయని తెలిపారు. దీంతో ఆహారం, నీరు ఫుడ్ పైప్ లోనే నిలిచిపోయి, మింగడంలో ఇబ్బంది, పడుకున్నప్పుడు పైకి రావడం, దగ్గు వంటి సమస్యలు వస్తాయన్నారు.
మొదట ఘన ఆహారం మింగడంలో ఇబ్బంది మొదలై, తర్వాత ద్రవాలు కూడా మింగలేని పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు. దీర్ఘకాలంలో ఫుడ్ పైప్ వెడల్పుగా మారే అవకాశం ఉందన్నారు.
అధునాతన చికిత్స POEM
అకలేషియా నిర్ధారణకు కేవలం సీటీ స్కాన్ మాత్రమే సరిపోదని, ఎండోస్కోపీ, బేరియం స్వాలో, ఈసోఫేజియల్ మానోమెట్రీ వంటి పరీక్షలు అవసరమని డా. కిషన్ తెలిపారు.
ప్రస్తుతం POEM (Peroral Endoscopic Myotomy) అనే అధునాతన ఎండోస్కోపిక్ చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. ఇందులో ఎండోస్కోప్ ద్వారా ఫుడ్ పైప్ గోడలోకి వెళ్లి బిగుతుగా ఉన్న కండరాన్ని సడలిస్తారని, బయట నుంచి పెద్ద కోత పెట్టాల్సిన అవసరం ఉండదని వివరించారు. చికిత్స తర్వాత నీరు, ఆహారం సులభంగా కడుపులోకి వెళ్తుందని, అయితే ఫాలో-అప్ ను డాక్టర్ సూచన మేరకు కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కే. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!