రాజధాని వాయిస్: అక్టోబర్ 26
మహర్షి వాల్మీకి భారత సమాజాన్ని సన్మార్గంలో నడిపించిన మహనీయులని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భగవంతుడి పరమార్థాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక కావ్యాలను చదవాలని సూచించారు. ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించే రామాయణంలోని నీతివంతమైన కథలను పిల్లలకు వివరించాలని అన్నారు. సంస్కృతంలో 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి గొప్పతనాన్ని కొనియాడారు. దేశ, రాష్ట్ర చరిత్రతో పాటు మహనీయుల జీవిత చరిత్రలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. దేశ చరిత్ర, ఆధ్యాత్మిక విలువలను తెలియజేసే కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఎదుటివారికి హాని కలిగించకుండా, ఇతరులకు మేలు చేయాలనే సద్భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న అన్నారు. బోయవాడిగా ఉన్న వాల్మీకి జ్ఞానోదయం ద్వారా మహర్షిగా ఎదిగి, సత్యం, ప్రేమ, దైవత్వం వంటి ఉన్నత విలువలను తన కావ్యాల ద్వారా సమాజానికి అందించారని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్‌డీఏ పీడీ బి. సింగయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!