- వారం రోజుల్లో వచ్చిన రెండు తుఫాన్లను సమర్థంగా ఎదుర్కొన్న యంత్రాంగం
- మురసు తుఫాన్ ప్రభావిత 7 జిల్లాల్లోని 465 గ్రామాల్లో సహాయక చర్యలు
- కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన
హోంమంత్రి అనిత
అమరావతి.
తుఫాన్ల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. వారం రోజుల్లో రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని ప్రభావితం చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు త్వరితగతిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మురసు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో బుధవారం హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మురసు తుఫాన్ ముప్పును ఎదుర్కొన్న ఏడు జిల్లాల్లోని 465 గ్రామాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా అధికారులు తక్షణమే స్పందించాలని, కంట్రోల్ రూమ్ల ద్వారా 24 గంటల పాటు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని సూచించారు. ముఖ్యంగా భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో, నీటితో నిండిన రహదారులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, రహదారులను దాటేందుకు ఎవరూ ప్రయత్నించరాదని హోంమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి చొరవతో తుఫాన్ నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను వెంటనే రాష్ట్రానికి పంపించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనిత ధన్యవాదాలు తెలిపారు.బాధితులకు భరోసా కల్పిస్తూ సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగించాలని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
Be the first to share your thoughts on this story!