అమరావతి, నవంబర్ 18 : బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తీవ్ర తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం, ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలపై హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలోని అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆమె ఆదేశించారు. తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అక్వాన్ తుపాను మందగమనంతో గంటకు కేవలం 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అధికారులు హోంమంత్రికి వివరించారు. ఎల్లుండి మధ్యాహ్నానికి శ్రీకాకుళం- దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అంచనా వేశారు. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుపాను అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 13 జాతీయ విపత్తు స్పందన దళాలు, 11 రాష్ట్ర విపత్తు స్పందన దళాలతో పాటు స్థానిక అగ్నిమాపక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక బృందాలను తక్షణమే రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నియంత్రణ కేంద్రాలు నిరంతరం 24 గంటల పాటు పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సహాయం కోరే సమాచారంపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని హోంమంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అధికారులు సూచించిన వెంటనే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. వర్షాలు, బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పొలాల్లో పనిచేసే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం, చెట్లు కూలిపోవడం, రహదారులపై నీరు నిలవడం వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. విద్యుత్ స్తంభాలు కూలిపోయినా, విద్యుత్ తీగలు తెగిపడినా వాటి సమీపానికి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అధికారికంగా జారీ చేసే వాతావరణ హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలని, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే నిర్ధారణలేని వార్తలు, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించాలని హోంమంత్రి సూచించారు. విద్యుత్ అంతరాయం, చెట్లు కూలడం, నీటి నిల్వలు, ఇతర సమస్యలపై ‘మన మిత్ర’ వాట్సాప్ నంబరు 9552300009కు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, అవసరమైన ప్రతి సందర్భంలో స్థానిక అధికారులను సంప్రదించాలని హోంమంత్రి అనిత విజ్ఞప్తి చేశారు. తుపాను ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు.
Sunday, 22 November 2026
www.rajadhanivoice.in
తుపాను ముప్పు.. అప్రమత్తంగా ఉండండి..
Story Highlights
- 48 గంటల పాటు యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో ఉండాలి.- ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- హోంమంత్రి అనిత ఆదేశం
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):
Be the first to share your thoughts on this story!