తాడేపల్లి, నవంబర్ 13 (రాజధాని వాయిస్):
బాలల హక్కులను పరిరక్షిస్తూ, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, భద్రతతో కూడిన బాల్యాన్ని అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్యా అన్నారు.
తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం (13-11-2026) గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిస్టర్ విద్యా మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినమైన నవంబర్ 14ను ఏటా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. పిల్లలపై అమితమైన ప్రేమను చూపిన నెహ్రూను చిన్నారులు ప్రేమగా 'చాచా నెహ్రూ' అని పిలిచేవారని, పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన విశ్వసించేవారని గుర్తుచేశారు. 1964 నుంచి నవంబర్ 14ను అధికారికంగా బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
బాలల హక్కులు, వారి సంక్షేమం, విద్య, ఆరోగ్యం, రక్షణపై సమాజంలో అవగాహన పెంపొందించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. పిల్లల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం. ఉమశ్రీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను అరికట్టి, ప్రతి బిడ్డకు సముచితమైన బాల్యాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి సమాజంలో సంఘర్షణలు, వాతావరణ మార్పులు, అసమానతలు చిన్నారుల భవిష్యత్తుకు సవాళ్లుగా మారుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.
అత్తోట పోతురాజు మాట్లాడుతూ పిల్లలు తమకు ఎలాంటి భవిష్యత్తు కావాలో స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశాలను కల్పించాలని అన్నారు. తల్లిదండ్రులు, పెద్దలు పిల్లలకు సరైన మార్గదర్శకులుగా నిలిచి వారి హక్కులను గౌరవిస్తూ భవిష్యత్తును కాపాడాలని సూచించారు. బాలల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అనంతరం ఏపీజే అబ్దుల్ కలాం బాలల పార్లమెంట్, కొలనుకొండ మరియు మహాత్మా గాంధీ బాలల పార్లమెంట్, వడ్డేశ్వరం విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ పి. శిరోమణి, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు అనిలా, ఎం. రామచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!