నక్కపల్లి, నవంబర్ 11:- రాజధాని వాయిస్
నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో హోం మంత్రి వంగలపూడి అనిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ..పరిషత్
ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పనిచేయడం వల్లే కూటమి అద్భుత విజయాలు సాధించిందన్నారు. కోటవురట్ల మండలంలో రికార్డు స్థాయిలో విజయం సాధించామని, 60 సంవత్సరాల చరిత్రను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. తంగేడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఎస్.రాయవరం మండలంలో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కూటమి విజయం సాధించిందని, పాయకరావుపేటలో బీజేపీ జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నామని తెలిపారు.అనకాపల్లి జిల్లాలో మొత్తం 24 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కూటమి గెలుచుకోవడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ సెగ్మెంట్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేయాలని సూచించారు. ఇదే ఐక్యత, ఇదే స్ఫూర్తితో రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ కూటమి విజయపరంపర కొనసాగించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
*ఆత్మీయత చాటుకున్న హోం మంత్రి అనిత*
విజయం సాధించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు హోం మంత్రి అనిత స్వయంగా భోజనాలు వడ్డించారు. సభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కలిసి ఆత్మీయంగా ముచ్చటించారు. మంత్రి చూపిన అభిమానానికి ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
Be the first to share your thoughts on this story!