మాచర్ల, సెప్టెంబర్ 23: రాజధాని వాయిస్ :
కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న నర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంట్రాక్ట్ నర్సులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైద్య సేవల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 14 వేల మంది కాగా , ఒక మాచర్ల నియోజక వర్గ పరిధిలోనే 58 మంది స్టాఫ్ కీలకంగా పనిచేస్తూ, రోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ తమను కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని నర్సులు తెలిపారు. తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, భవిష్యత్‌పై అనిశ్చితి వంటి సమస్యలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామని, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో తమ సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. సమాన పనికి సమాన హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కాంట్రాక్ట్ నర్సులను అర్హతలు, సర్వీసు కాలం, ట్రాన్స్ఫర్ లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా నర్సులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ నర్సులు శివరంజని, అన్నమేరి, మల్లేశ్వరి, కామేశ్వరి, శకుంతల, శ్రీలత పారా మెడికల్ లో కళ్యాణ్, కృష్ణా రెడ్డి, అరుణ, సుమా, టెక్నీషియన్ లు రాంబాబు, బేగం,కళ్యాణ్ మరియు ఇతర సిబ్బంది అందరూ ర్యాలీ లో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!