Tuesday, 20 October 2026
Header1
BREAKING

గుంటూరును స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దుదాం: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

- హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 22 Sep 2026, 04:37 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 149 views

గుంటూరు సెప్టెంబర్ 22 రాజధాని వాయిస్ :

గుంటూరు నగరాభివృద్ధికి కొత్త దిశగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టులు దోహదపడతాయని, సమగ్ర మౌలిక సదుపాయాల కల్పన ద్వారా గుంటూరును స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.

పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎల్‌ఈడీ తెర ద్వారా జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్‌తో కలిసి ఎమ్మెల్యే గళ్ళా మాధవి వీక్షించారు.
WhatsApp Image 2026-09-22 at 4.34.04 PM.jpeg
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... హ్యామ్ ప్రాజెక్టులను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని, పట్టణాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి ప్రతిబింబమని, ఒక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అక్కడి మౌలిక సదుపాయాలను బట్టి అంచనా వేయవచ్చన్నారు. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై నిరంతరం దృష్టి సారించే దూరదృష్టి గల నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
ఇప్పటివరకు ప్రధాన రహదారులు, ఓడరేవులు వంటి భారీ ప్రాజెక్టుల్లో అమలైన హ్యామ్ విధానాన్ని ఇప్పుడు కార్పొరేషన్ స్థాయికి తీసుకురావడం ఎంతో అవసరమని ప్రభుత్వం భావించిందన్నారు. హ్యామ్ అనేది సమగ్ర అభివృద్ధి నమూనా అని, ఒక ప్రాంతంలో రహదారులు మాత్రమే కాకుండా డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యాలు, తాగునీరు, ఉద్యానవనాలు, పచ్చదనం, భూగర్భ కేబుల్ వ్యవస్థలు వంటి అన్ని అంశాలను సమన్వయంతో అభివృద్ధి చేయడమే దీని ప్రత్యేకత అని వివరించారు.
1004152218.png
Type image caption here...


ప్రస్తుతం ఒక శాఖ రోడ్డు వేస్తే, మరో శాఖ డ్రైనేజీ పనులు, ఇంకో శాఖ విద్యుత్ లేదా కేబుల్ పనులు చేయడం వల్ల ప్రజలకు పూర్తి స్థాయి సౌకర్యాలు అందడం లేదన్నారు. హ్యామ్ విధానంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
ఇలాంటి సమగ్ర అభివృద్ధి ఆలోచనలను అమలు చేయడం సాధారణ నాయకత్వానికి సాధ్యం కాదని, దూరదృష్టి గల నాయకత్వం వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైటెక్ సిటీ నుంచి అమరావతి, క్వాంటం వ్యాలీ వరకు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పట్టణాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించారని తెలిపారు.
హ్యామ్ ప్రాజెక్టుల విజయానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ వ్యవస్థ, ప్రజలు అందరూ ఒకే లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా పరిశుభ్రత నుంచి మౌలిక వసతుల అభివృద్ధి వరకు ఏ కార్యక్రమమూ పూర్తిస్థాయిలో విజయవంతం కాదన్నారు.
అమరావతికి సమీపంలో ఉన్న గుంటూరుకు ఇది ఒక సవాల్‌తో పాటు గొప్ప అవకాశమని పేర్కొన్న ఎమ్మెల్యే, రాజధాని అభివృద్ధికి అనుగుణంగా గుంటూరును కూడా ఆధునిక నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. గత రెండేళ్లలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే సుమారు రూ.400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని, ఇది ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ ఫలితమని చెప్పారు.
జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మను ఉద్దేశించి మాట్లాడుతూ గుంటూరులో ఒక వార్డును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయాలని, కేబుల్ వైర్ల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే భూగర్భ చెత్త సేకరణ వ్యవస్థను నగరంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని జీఎంసీ కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.గుంటూరును రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి, పట్టణాల సమగ్ర అభివృద్ధికి హ్యామ్ ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గుంటూరు నగర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X