Monday, 24 August 2026
Telugu Daily
BREAKING

వైసిపి నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

కులం కార్డు వెనుక అవినీతిని దాచలేరు – చట్టం ముందు తప్పు చేసినవారు శిక్షార్హులే: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు. ఆగస్టు 24 రాజధాని వాయిస్ :

వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విమర్శించారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడారు.

లిక్కర్ స్కామ్‌లో చట్టం తన పని తాను చేసుకుంటోంది

గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో జరగని అక్రమం, జరగని కుంభకోణం లేదని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు నుంచి రేషన్ బియ్యం పంపిణీ వరకు, లిక్కర్ విధానాల నుంచి ప్రభుత్వ విభాగాల వరకు ప్రతిచోటా అవినీతి రాజ్యమేలిందన్నారు.లిక్కర్ స్కామ్‌పై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. నేడు ఆ అక్రమాలపై విచారణ జరుగుతుండగా, చట్టం తన పని తాను చేసుకుంటోందని పేర్కొన్నారు.

ఈడీ అరెస్టు – సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరణ

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిందన్నారు.
ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయంపై కూడా విచారణ జరుగుతోందని తెలిపారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు తిరస్కరించిందని, దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఈడీ మరియు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలను కూడా వైఎస్సార్సీపీ రాజకీయ కోణంలో చూపడం విచారకరమన్నారు.

రాజకీయ కక్ష కాదు – చట్టపరమైన చర్య

కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా చిత్రీకరించడం పూర్తిగా అవాస్తవమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.తప్పు చేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. చట్టం ముందు అందరూ సమానమే. ప్రభుత్వం ఎవరినీ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం లేదు. కానీ అవినీతి చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని ఎమ్మెల్యే మాధవి అన్నారు.

కులం కార్డు చూపించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం

వైఎస్సార్సీపీ నాయకులు తమ అక్రమాలను సమర్థించుకోవడానికి ప్రతిసారీ కులం కార్డును ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఒక వ్యక్తి అవినీతి ఆరోపణలతో అరెస్టు అయితే దానిని బీసీలు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలపై దాడిగా చిత్రీకరించడం దురుద్దేశపూర్వక రాజకీయమని విమర్శించారు.
అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని కేవలం అతని కులం ఆధారంగా రక్షించే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. చట్టపరమైన చర్యలను కుల కోణంలో చూడటం సరికాదన్నారు.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అత్యధికంగా కృషి చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు ఇతర వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తోందని తెలిపారు.
వైఎస్సార్సీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలపై జరిగిన అన్యాయాలను ప్రజలు మరచిపోలేదన్నారు. ఇప్పుడు అదే పార్టీ నాయకులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆ వర్గాల పేర్లు ఉపయోగించడం సిగ్గుచేటని విమర్శించారు.

లిక్కర్ స్కామ్ బాధిత మహిళలకు సమాధానం చెప్పాలి

లిక్కర్ విధానాల కారణంగా వేలాది కుటుంబాలు నష్టపోయాయని, అనేక మంది మహిళలు తమ కుటుంబ పెద్దలను కోల్పోయారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ వల్ల నష్టపోయిన కుటుంబాలను పరామర్శించకుండా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రమే పరామర్శించడం వైఎస్సార్సీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

వైఎస్సార్సీపీ నాయకులు ప్రతి అరెస్టును రాజకీయ కక్షగా, ప్రతి చట్టపరమైన చర్యను కుట్రగా చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని గళ్ళా మాధవి అన్నారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పే దానికి నిదర్శనమని పేర్కొన్నారు.

పారదర్శక పాలనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక, అవినీతి రహిత పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
మీరు చేసిన పాపాలకు రాజకీయాన్ని అడ్డం పెట్టుకోవద్దు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకుని, చట్టపరమైన ప్రక్రియను గౌరవించాలి అని వైఎస్సార్సీపీ నాయకులకు హితవు పలికారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!